శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (11:10 IST)

శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక రోజు పగలంతా మూసివేయనున్నారు. దీనికి కారణం చంద్రగ్రహణమే. ఈనెల 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది.

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక రోజు పగలంతా మూసివేయనున్నారు. దీనికి కారణం చంద్రగ్రహణమే. ఈనెల 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. దీంతో ఆ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపి వేస్తున్నట్లు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నదని, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. 
 
ఆ తర్వాత రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదాల వితరణ ఉండదని, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదని తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామన్నారు.
 
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశామన్నారు.