సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:03 IST)

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి సేవలో పీవీ సింధు

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్, భారత షట్లర్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ దర్శనానికి వచ్చిన పీవీ సింధుకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శాలువా కప్పి ఘనంగా సత్కరించినట్లు తెలుస్తోంది.
 
కాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పీవీ సింధుకు ప్రధాని నరేంద్ర మోడీ ఐస్‌క్రీమ్ తినిపించిన విషయం తెల్సిందే. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటకు కూడా ఒలింపిక్స్ అథ్లెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించగా ఈ బృందంలో కూడా పీవీ సింధు ఉన్నారు. 
 
ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంది. పీవీ రాక సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.