శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (14:08 IST)

ధాన్యం కొనుగోలుపై భవిష్యత్ కార్యాచరణః కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ

టీఆర్ఎస్ ఎంపీలు బుధ, గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌‍లో పరిణామాలపై ఎంపీలు సీఎం కేసీఆర్‌కు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఈ సమావేశంలోనే ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. 
 
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినా పార్లమెంట్ బయట నిరసన తెలియజేసే విషయమై సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు సిద్ధం అవుతున్నారు.
 
కాగా.. ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ లోక్‌సభ, రాజ్యసభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన టీఆర్ఎస్ ఎంపీలు తెలియజేశారు. 
 
ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చారు. తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది.