తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులోభాగంగా, సోమవారం నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, పాలమూరు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమికంగా హెచ్చరించింది.
ముఖ్యంగా, ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, అంతర్గత కర్నాటక మీదుగా కొమోరిన్, ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర - దక్షిణ ద్రోణి కొనసాగుతున్నదని పేర్కొంది. దీని ప్రభావం కారణంగా ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.