ఉప్పొంగిన మంజీరా నది.. మెదక్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు
వర్షాలకు మెదక్ జిల్లాలో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఆయా జిల్లాలోని నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ మినహా ఇతర జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారా అనే అంశం తెరపైకి రాగా.. ఆయా జిల్లాల కలెక్టర్లకు సెలవులు ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. ఏడుపాయల వనదుర్గా ఆలయంలో వరద నీరు వచ్చి చేరుతోంది. నార్సింగ్ వద్ద నేషనల్ హైవేపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ వరదకు బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు.
దీంతో వాహనదారులకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక సిద్దిపేట జిల్లాలోని పాతూర్ గ్రామంలో అత్యధికంగా 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.