సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (15:40 IST)

ఐటీ విచారణకు హాజరుకాలేను... మా ఆడిటర్ వస్తారు : మంత్రి మల్లారెడ్డి లేఖ

malla reddy
ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గృహాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇలా మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, మంత్రి మల్లారెడ్డి మాత్రం ఐటీ అధికారుల విచారణకు సోమవారం హాజరుకాలేదు. పైగా, తాను హాజరుకాలేనని, తన తరపున ఆడిటర్ హాజరవుతారంటూ ఐటీ అధికారులకు ఓ లేఖ రాశారు. 
 
ఉప్పల్‌లో జరగనున్న పలు కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సివుందని అందుకే విచారణకు వెళ్లలేక పోతున్నానని చెప్పారు. నోటీసులు అందుకున్న ఇతరులంతా విచారణకు హాజరవుతారని తెలిపారు. మరోవైపు, విచారణ నేపథ్యంలో ఐటీ కార్యాలయం వద్ద గట్టి భద్రతను కల్పించారు. 
 
కాగా, ఈ సోదాలకు సంబంధించిన ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో మంత్రి మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రేయా రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, నర్సింహా యాదవ్, జైకిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. వీరి వద్ద మూడు రోజుల పాటు విచారణ సాగనుంది.