అమరావతికి ఏమిచ్చారు.. లొట్టెడు నీళ్లు.. తట్టెడు మట్టి (video)

ktrao
ఠాగూర్| Last Updated: మంగళవారం, 24 నవంబరు 2020 (20:44 IST)
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోన బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏకిపారేస్తున్నారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెరాస అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏపీకి కొత్త రాజధానిగా శంకుస్థాపన చేసుకున్న అమరావతికి సైతం లొట్టెడు నీళ్లు.. తట్టెడు మట్టి తప్ప ఏమిచ్చారంటూ నిలదీశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాము రూ.67 వేల కోట్లతో పనులు చేశామని, కేంద్రం చేసిన అణా పైసా పని ఉంటే బీజేపీ నేతలు చూపించాలని సవాల్‌ చేశారు.
హైదరాబాద్‌లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని కేంద్రమంత్రి అంటున్నారని, కానీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాల్లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే తానే రూ.10 లక్షలు ఇస్తానని కేటీఆర్‌ ప్రకటించారు.

సోమవారం తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బిల్డర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ మరింత అభివృద్ధి కావాలంటే తాత్కాలికంగా కఠినంగా వ్యవహరించాలని, దీనికి బిల్డర్ల సహకారం కావాలని కేటీఆర్‌ కోరారు. తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్‌ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ ఇళ్లకు కేంద్రం హడ్కో అవార్డు ఇస్తే.. ఇళ్లే నిర్మించలేదంటున్నారని విమర్శించారు. వరద బాధితులకు తాము అందించిన రూ.10 వేలకు అదనంగా రూ.25 వేలను వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలకు తెలిసింది చిచ్చు పెట్టడం ఒక్కటేనని, తమ నినాదం విశ్వనగరమైతే.. వారిది విద్వేష నగరమంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


దీనిపై మరింత చదవండి :