మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:21 IST)

విపక్ష నేతలు దొంగలన్నట్టుగా కేంద్ర పెద్దల తీరుంది : కేశవ రావు

kkeshavrao
కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సచ్ఛీలులు, విపక్షంలో ఉన్నవారు దొంగలు అన్నట్టుగా కేంద్ర పాలకుల వ్యవహారశైలి ఉందని తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు ఆరోపించారు. పైగా, దేశంలో జీ-20 సదస్సును నిర్వహించడం పెద్ద గొప్పేమి కాదన్నారు. 
 
ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. ప్రతిపక్షాల నేతలు దొంగలు, తాము మంచివాళ్ళం అనే విధంగా కేంద్రం పెద్దలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 
 
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభా సమావేశాల్లో 50 శాతం సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేటాయించాలని ఆయన కోరారు. అదేసమయంలో జీ-20 సదస్సును నిర్వహించడం గొప్ప విషయమేమీ కాదన్నారు. 
 
ఇదిలావుంటే, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. బొగ్గు కేటాయింపులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పట్టుబట్టాలని చెప్పారు. అలాగే, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకునిరావాలని ఆయన సొంత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.