శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:49 IST)

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో విత్తనాల ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌

వచ్చే నెల నుంచి రైతులకు విక్రయించే విత్తన ప్యాకెట్లపై ‘క్విక్‌రెస్పాన్స్‌’ (క్యూఆర్‌) కోడ్‌ ముద్రించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు విక్రయించే 20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను చిన్న చిన్న ప్యాకెట్లలో రైతులకు విక్రయిస్తారు.

ప్రతి ప్యాకెట్‌పై ఈ కోడ్‌ ముద్రిస్తారు. వాటిని ఎక్కడ పండించారు, మూల విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కంపెనీ వాటిని ఉత్పత్తి చేసింది, ఏ ప్రయోగశాల శుద్ధి చేసింది, బ్యాచ్‌ నంబర్‌ తదితర వివరాలన్ని ఆ కోడ్‌లో నిక్షిప్తం చేయాలని ప్రైవేటు కంపెనీలకు ఎస్‌సీఏ సూచించింది.

దేశంలో మరెక్కడా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలు ఇలా కోడ్‌ను ముద్రించడం లేదని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ (ఎస్‌సీఏ) సంచాలకుడు డాక్టర్‌ కేశవులు ‘ఈనాడు’కు చెప్పారు.
 
ఎన్నో ఉపయోగాలు 
నాసిరకం, నకిలీ విత్తనాల సమస్యను అధిగమించేందుకు విత్తన ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించాలని 2019లోనే కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్రాలను ఆదేశించింది.

దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ, విత్తన కంపెనీలు, ఎస్‌సీఏ అధికారులతో కసరత్తు చేసి ఈ సీజన్‌ నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రైతు ప్యాకెట్‌ను కొన్నవెంటనే తన సెల్‌ఫోన్‌తో దానిపై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ విత్తనాలకు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి.