గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (17:09 IST)

తెలంగాణాకు శుభవార్త : మూడు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణాకు శుభవార్త చెప్పింది. వచ్చే మూడు వారాల పాటు తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌తో పాటు మొత్తం 17 జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 
 
మరఠ్వాడా నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించివున్న ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా, ఉదయం 11 గంటలు దాటితో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి వార్తను చెప్పడం గమనార్హం.