మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (14:09 IST)

అన్న రాఖీ కట్టించుకోలేదనీ చెల్లి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో విషాదకర ఘటన ఒకటి జరిగింది. రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టించుకోవడానికి అన్న నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రమేశ్, మమత (20) అనే ఇద్దరు అన్నాచెల్లెళ్లు. జహీరాబాద్‌లోని చెన్నారెడ్డి నగర్‌లో తండ్రి బసవన్నతో కలిసి అద్దె ఇంట్లో నిసిస్తున్నారు. కొన్నాళ్లుగా అన్నాచెల్లెళ్లు మాట్లాడుకోవడం లేదు. 
 
అయితే ఆదివారం ఉదయం రాఖీ కట్టేందుకు మమత ప్రయత్నించగా రమేశ్ నిరాకరించాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి రమేశ్ పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మమత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
 
మరోవైపు, రాఖీ పండగ రోజు అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే ఓ చెల్లెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని అరండల్‌పేటలో జరిగింది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడికి తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసి నిశ్చేష్టులయ్యారు. 
 
ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని ఉష సోదరుడు సూర్యనారాయణ వెళ్లాడు. 
 
అయితే, రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని సమాచారం ఇచ్చారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నారు.