గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:47 IST)

సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు - 20న భేటీ

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపువచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 20న జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. 
 
కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యమంత్రిని కలిసి వీటిని విన్నవించాలనుకుంటున్నామంటూ ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 
 
ఆ తర్వాత మంత్రి పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం సిద్ధమవుతోంది. సీఎం జగన్‌ను కలవనున్న వారిలో అక్కినేని నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు. ఇక, జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.