శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (16:14 IST)

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మహేష్ "సరిలేరు నీకెవ్వరు"

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రను పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో అత్యధి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం అందరి అంచనాలకు తగ్గట్టుగానే సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
యాక్షన్, ఎమోషనల్, కామెడీ అన్ని విభాగాల్లో ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించి, ఆలరిస్తోంది. 
 
నిజానికి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. అంచనాలకు మించి సరిలేరు నీకెవ్వరు చిత్ర వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లకు పైగా షేర్ రాబట్టుకుంది. ఇది 
మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూలు కావడం గమనార్హం. 
 
ఇక టాలీవుడ్ చరిత్రలో తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సాధించిన  షేర్ రూ.46 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. యుఎస్‌లో ఇప్పటికే సరిలేరు వసూళ్లు 1 మిలియన్ డాలర్లను దాటేసింది. 
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా సరిలేరు నీకెవ్వరు చిత్ర వసూళ్లను పరిశీలిస్తే, 
 
నైజాం రూ.8.66 కోట్లు, ఉత్తరాంధ్ర రూ..4.10 కోట్లు, సీడెడ్ రూ.3.70 కోట్లు, గుంటూరు రూ.5.15 కోట్లు, కృష్ణా రూ.3.07 కోట్లు, ఈస్ట్ రూ.3.32 కోట్లు, వెస్ట్ రూ.2.72 కోట్లు, నెల్లూరు రూ.1.27 కోట్లు అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం రూ.32.02 కోట్ల ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం రాబట్టింది. 
 
అంటే ఈ చిత్రానికి ఖర్చుచేసిన మొత్తంలో 40 శాతం మేరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇపుడు సంక్రాంతి పండుగతో పాటు సెలవులు కావడంతో మహేష్ బాబు సరిలేరు విధ్వంసం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. 
 
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఈ చిత్రం ప్రభాస్ బాహుబలి రికార్డును తిరగరాసింది. ఇక్కడ తొలి రోజున సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.37,27,029 గ్రాస్‌ను వసూలు చేయగా, బాహుబలి-2 చిత్రం రూ.36,09,236 గ్రాస్‌ను వసూలు చేసింది.