గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:02 IST)

చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో సత్యదేవ్

Chiranjeevi, Satyadev
Chiranjeevi, Satyadev
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం 'గాడ్ ఫాదర్' కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేక ఆకర్షణలు వున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
 
తాజాగా గాడ్‌ఫాదర్‌లో నటుడు సత్యదేవ్ కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.'ఆచార్య' సినిమాలో తన ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..“అన్నయ్యా,నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే  అవకాశం దక్కింది'' అని ట్వీట్ చేశారు సత్యదేవ్.  
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఓ ఫోటో గ్రాఫ్ ని అభిమానులతో పంచుకున్నారు.
 
దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ,..“డియర్ సత్యదేవ్  ..థ్యాంక్ యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #ఆచార్య లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! ” అని రీట్వీట్ చేశారు మెగాస్టార్.
 
టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.
 
ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.