మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (19:38 IST)

దేవిశ్రీప్రసాద్‌‌కి అప్పుడు నేనో ప్రోగ్రామర్... సామజవరగమనాతో అదరగొడుతున్న తమన్ ఇంకేమన్నాడంటే?

టాలీవుడ్‌లో సంగీతానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు దేవిశ్రీప్రసాద్, తమన్‌లు మాత్రమే. అగ్రహీరోల సినిమా అంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సంగీతం అందించాల్సిందే అనేంతగా ట్రెండ్ సెట్ అయింది అంటే అతిశయోక్తి కాదు.

కాగా... దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి బాణీలు అందిస్తూండగా, అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. దీనికి సంబంధించి తమన్, ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు, మీరు సంగీతం అందించిన అల వైకుంఠపురములో సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కదా, మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా, పోటీ ఉన్నప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుందని జవాబిచ్చారు తమన్.

అయితే, తనకు దేవిశ్రీప్రసాద్‌తో సత్సంబంధాలు ఉన్నాయనీ, ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో సంభాషణలు కూడా జరుగుతూ ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, తాను గతంలో దేవిశ్రీప్రసాద్ వద్ద తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్‌గా కూడా వ్యవహరించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.