బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 మే 2020 (22:25 IST)

ఈ వేసవిలో నీటి శాతం ఎక్కువున్న ఈ పచ్చడి తింటే...

వేసవిలో శరీరానికి నీరు సమృద్ధిగా అందకపోతే డిహైడ్రేషన్‌కు గురి అయ్యేప్రమాదం ఉంది. నీరు అందుబాటులో లేనప్పుడు దోసకాయను తీసుకుంటే అది శరీరానికి కావలసిని నీటిని అందిస్తుంది. డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఇందులో అధిక నీరు, తక్కువ క్యాలరీలు ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారు దోసకాయను తమ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
 
కావాలసిన పదార్థాలు: 
దోసకాయ - ఒకటి
ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి - ఆరు
మినపప్పు - కొద్దిగా 
సెనగపప్పు - కొద్దిగా 
నూనె - 2 స్పూన్స్
పోపుదినుసులు - సరిపడా
ఉప్పు - తగినంత
వెల్లుల్లి రేకలు - ఆరు 
చింతపండు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా దోసకాయకు చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత బాణలీని తీసుకుని నూనె వేసి వేడయ్యాకా ఎండుమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి. అవి వేగిన తరువాత వాటిని తీసివేసి అదే నూనెలో ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసి బాగా మగరనివ్వాలి. ఇక మిక్సీ జార్లో లేదా రోట్లో ముందుగా వేపిన ఆ మిశ్రమాన్ని వేసి అందులో ఉప్పు, వెల్లుల్లి, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోసముక్కలను వేసి గ్రైండ్ చేయాలి. చివరగా బాణలిలో నూనెవేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఘుమఘములాడే దోసకాయ పచ్చడి రెడీ.