శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 23 సెప్టెంబరు 2023 (14:54 IST)

'గూగుల్ మ్యాప్‌ను ఫాలో కావడంతోనే నా భర్త చనిపోయాడు'.. కోర్టుకెళ్లిన మహిళ

google map
2022 సెప్టెంబర్‌లో అమెరికాలోని నార్త్ కరోలినాలో కూలిన వంతెనపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి ఫిలిప్ పాక్సన్ అనే వ్యక్తి చనిపోయారు. ఆయన కుటుంబం ఇప్పుడు 'గూగుల్ మ్యాప్స్' యాప్‌ను నిర్వహించే Google కంపెనీపై కోర్టులో దావా వేసింది. హికోరిలోని సదరు వంతెన తొమ్మిదేళ్ల క్రితం కూలిపోయిందని, అది గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ కాలేదని.. అది చూపించిన రూట్‌లో వెళ్లి ఫిలిప్ చనిపోయారని ఆయన భార్య అలీసియా ఆరోపించారు. గూగుల్ తన మ్యాప్‌లను అప్‌డేట్ చేసి ఉంటే, ఫిలిప్ ఆ వంతెనపై నుంచి వెళ్లేవారు కాదని ఆమె వాదిస్తున్నారు. ఫిలిప్ మృతికి గూగుల్ బాధ్యత వహించాలంటూ మంగళవారం వేక్ కౌంటీలోని సివిల్ కోర్టులో ఆయన కుటుంబం కేసు వేసింది.
 
అసలేం జరిగింది?
ఫిలిప్‌ పాక్సన్‌కు ఇద్దరు పిల్లలు. తన కూతురు తొమ్మిదో పుట్టినరోజు వేడుకలను తన స్నేహితుడి ఇంట్లో జరుపుకున్నారు. అయితే, పార్టీ అనంతరం ఇంటిని శుభ్రం చేసేందుకు ఫిలిప్ అక్కడే ఉండిపోవడంతో అతని భార్య అలీసియా ఇద్దరు కూతుర్లను తీసుకొని ఇంటికి వెళ్లారు. అనంతరం ఫిలిప్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతం ఫిలిప్‌కు ఎక్కువగా తెలియదని ఆయన కుటుంబం అంటోంది. ''ఆయనకు అక్కడి రోడ్ల గురించి అవగాహన లేదు. అందుకే ఇంటికి సురక్షితంగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయ్యారు'' అని కుటుంబ సభ్యులు దావాలో పేర్కొన్నారు.
 
'' ఆ రాత్రి వర్షం పడుతోంది. ఫిలిప్ దురదృష్టవశాత్తు గూగుల్ మ్యాప్స్ సూచనలను అనుసరించారు. కానీ, ఆ మ్యాప్ అప్ డేట్ కాలేదు. మ్యాప్ డైరెక్షన్స్ ఫిలిప్‌ను 2013లో కూలిపోయిన వంతెన వద్దకు నడిపించాయి. అయితే Google Mapsలో చూపినట్లుగా అక్కడ వంతెన లేదు. దీంతో ఫిలిప్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకరమైన కాలువలో పడిపోయారు. స్థానికులు అక్కడి మ్యాప్ అప్‌డేట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించినా, గూగుల్ మార్పులు చేయలేదు. ఇపుడు ఫిలిప్ మరణానికి గూగుల్ మ్యాప్స్‌ కారణమైంది'' అని బాధిత కుటుంబం దావాలో ఆరోపించింది.
 
'నాన్న ఎలా చనిపోయారని పిల్లలు అడుగుతున్నారు'
కుప్పకూలిన వంతెనపైకి ఎవరూ వెళ్లకుండా నిరోధించడానికి అక్కడ గతంలో బారికేడ్స్ ఉండేవి. కానీ ఎవరో వాటిని ధ్వంసం చేశారని షార్లెట్ అబ్జర్వర్ వార్తాసంస్థ తెలిపింది. దీంతో గూగుల్‌పై మాత్రమే కాకుండా మూడు స్థానిక కంపెనీలపై కూడా దావా వేశారు బాధితులు. వంతెన నిర్వహణ, దానిని సురక్షితంగా ఉండేలా చూసుకోవడం వారి బాధ్యత అని దావాలో పేర్కొన్నారు. తమ తండ్రి ఎలా? ఎందుకు మరణించాడని పిల్లలు అడుగుతున్నారని, ఘటన ఎలా జరిగిందో చెప్పడానికి మాటలు రావడం లేదని ఫిలిప్ భార్య అలీసియా పాక్సన్ అంటున్నారు.
 
జీపీఎస్, వంతెన నిర్వహణలో భాగమయ్యేవారు ప్రజల ప్రాణాల గురించి ఎందుకు శ్రద్ధ చూపడం లేదో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్‌ ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. Google Maps ద్వారా ఖచ్చితమైన దిశలను అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాజ్యాన్ని సమీక్షిస్తున్నామని తెలిపారు.