శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 జూన్ 2024 (09:24 IST)

బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్.. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ రికార్డుల మోత

hardik pandya
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా మెరిశాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
 
ఈ అజేయ హాఫ్ సెంచరీతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి నెంబర్ 6 బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాల రికార్డులను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.
 
అలాగే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన సూపర్ మ్యాచ్‌లో 37 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు.


అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (40; 32 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కుల్‌దీప్ యాదవ్ (3/19) మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా (2/13), అర్షదీప్ సింగ్ (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ క్రమంలో టీమిండియా అరుదైన రికార్డులు బ్రేక్ చేసింది. 
Team India
Team India
 
టీ20 వరల్డ్ కప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. బంగ్లాపై మన బ్యాటర్లు 13 సిక్సర్లు బాదారు. అంతకుముందు 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన 11 సిక్సర్లు అత్యధికంగా ఉండేవి.