ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:35 IST)

ఐపీఎల్‌లో ఆరేళ్ల వరకూ టైటిల్ గెలుచుకోలేదు.. ముంబై ఏం చేస్తుందో?

ఐపిఎల్‌లో ముంబయ్ ఇండియన్స్ అంటే మనకు గుర్తుకు వచ్చేది స్టార్ ఆటగాళ్లు, సమర్థవంతమైన కుర్రాళ్లు, తిరుగులేని కోచింగ్ బృందం. ఈ విషయంలో ముంబయ్‌కి సాటి ఏదీ లేదు. చేసిన 11 ప్రయత్నాలలో మూడుసార్లు ఛాంపియన్‌గా ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. ఐపిఎల్‌లో ఎక్కువ విజయాలు సాధించిన జట్లలో ముంబయ్ ఇండియన్స్ కూడా ఒకటి. 
 
కానీ ఐపిఎల్ ప్రారంభమైన ఆరేళ్ల వరకూ ఆ జట్టు తొలి టైటిల్ గెలుచుకోలేదు. 2013లో తొలి టైటిల్ గెలుచుకున్న ముంబయ్, మరో రెండుసార్లు (2015, 2017) ట్రోఫీలో ఛాంపియన్‌షిప్ సాధించింది. స్టార్‌లు ఎంతమంది ఉన్నా అందరూ కలిసి సమిష్టిగా పోరాడకపోవడంతో గతేడాది ముంబయ్ ప్లేఆఫ్‌ దశకు చేరకుండానే వెనుదిరిగింది. దాంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉంది. 
 
వనరుల పరంగా ముంబయ్ జట్టుకు ఎలాంటి కొదువ లేదు. వారి ప్రధాన బలహీనత క్రీడాకారులందరూ కలిసికట్టుగా ఆడకపోవడమే. ఒకరిద్దరిపైన ఆధారపడి ఆ జట్టు గెలిచే మ్యాచ్‌లను కూడా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి ముంబయ్ జట్టులో పెద్ద స్టార్‌గా యువరాజ్ చేరారు. కానీ అతని ఫామ్‌ని చూస్తుంటే అన్ని మ్యాచ్‌లు ఆడగలడా అనే సందేహం వస్తోంది. 
 
పొలార్డ్‌ పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది. వారిలో మునుపటి జోరు ఇప్పుడు లేదు. అంబటి రాయుడిని వదులుకోవడం ముంబయ్‌కి మరో మైనస్ పాయింట్. మిడిలార్డర్‌ని బలహీనంగా మార్చుకున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే కూడా పటిష్టంగా లేదనిపిస్తోంది. శ్రీలంక స్టార్‌ లసిత్‌ మలింగ సమర్థవంతంగా రాణించలేకపోతున్నాడు. ఇక ముంబయ్ ఆధారపడాల్సింది బుమ్రా, మెక్లెనగన్‌ల పైనే. 
 
వారి పనితీరు ఈసారి ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రపంచ కప్ దృష్ట్యా బుమ్రా అన్ని మ్యాచ్‌లలో ఆడతాడా అనేది సందేహమే. స్పిన్ విభాగంలో లెగ్‌స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండె, ఆఫ్‌ స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య కీలకంగా వ్యవహరించనున్నారు.