సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:45 IST)

బిగ్‌బాస్-4 సీజన్‌పై ఐపీఎల్ ప్రభావం... నిర్వాహకుల సాహసం!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బిగ్ బాస్-4 సీజన్‌పై ఈ దఫా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ బిగ్ బాస్ ప్రసారమయ్యే సమయంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ కానున్నాయి. దీంతో కుర్రకారు అంతా ఐపీఎల్ మ్యాచ్‌లను తిలకించేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. 
 
బిగ్‌బాస్‌-4 సీజన్ ఆదివారం నుంచి ఆరంభమైంది. ఐపీఎల్‌కు కూడా అధికారిక షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచే ఐపీఎల్‌ షురూ కానుంది. అంటే 13 రోజులే తేడా. ఈ రెండూ ఎంటెర్‌టైన్‌మెంట్‌ షోలు దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండటంతో వ్యూయర్‌షిప్‌ పరంగా బిగ్‌బాస్‌కు ఇది దెబ్బగానే చెప్పొచ్చు.  
 
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 7:30 గంటల నుంచి జరుగుతాయి. లీగ్‌లో రెండేసి మ్యాచ్‌లు అనేది 10 రోజులే జరుగుతాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌తోనే బిగ్‌బాస్‌ షోకు ఇబ్బంది. సాధారణంగా క్రికెట్‌కు ఫ్యాన్స్‌ ఎక్కువ కాబట్టి, బిగ్‌బాస్‌ షో వ్యూయర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. 
 
ఈ సీజన్‌ ఐపీఎల్‌-13 సీజన్‌ జరుగుతుందని తెలిసినప్పటికీ బిగ్‌బాస్‌ యాజమాన్యం సాహసించి నిర్ణయం తీసుకుంది. దీనిపై తొలుత తర్జన భర్జనలు పడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకవేళ ఐపీఎల్‌ అయిన తర్వాత బిగ్‌బాస్‌ షోను నిర్వహించాలంటే రెండు నెలలు ఆగాల్సి వస్తుందనే కారణంతోనే యాజమాన్యం చివరకు షోను నిర్వహించడానికే ముందుడగు వేసింది.
 
ఒకరోజు అయిన షోను మళ్లీ రిపేట్‌ చేసే అవకాశం ఉండటమే బిగ్‌బాస్‌ ధైర్యం చేసి నిర్ణయం తీసుకోవడానికి కారణం కావొచ్చు. ఏది ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌లో ఇప్పుడు సక్సెస్‌ ఫియర్‌ కూడా మొదలైందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.