శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (11:36 IST)

సీఎం పేషీ కోసం రుషికొండపై చకచకా ఏర్పాట్లు

rushikonda
విశాఖపట్నం నుంచి వైకాపా ప్రభుత్వం పరిపాలన సాగించేందుకు రుషికొండపై ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పర్యాటకశాఖ రిసార్టుల పేరుతో సీఎం కార్యాలయ భవనాలకు దాదాపు రూ.200 కోట్ల వరకూ నిధులు వెచ్చించారు. ప్రస్తుతానికి అవి పర్యాటక భవనాలేనని, పూర్తయ్యాక ప్రభుత్వం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చంటూ వైకాపా నేతలు ఇప్పటికే మీడియా సమావేశాల్లో చెప్పుకొచ్చారు. 
 
ఈ నెల 23, 24వ తేదీల్లో ముఖ్యమంత్రి విశాఖకు రానున్నారని, పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుందని చెబుతున్నారు. విశాఖలో ఏర్పాట్లు కొలిక్కి వచ్చేదానిని బట్టి సీఎంవో కార్యాలయం పూజ ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
రుషికొండలో పర్యావరణ అడ్డంకుల వల్ల శాశ్వత సబ్ స్టేషన్ ఏర్పాటుకు వీల్లేదని, అందుకని కంటెయినర్ మోడల్‌లో ఏర్పాటు చేసి భూగర్భ కేబుల్‌తో అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం సుమారు రూ.7 కోట్లతో కంటెయినర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 
 
సీఎం సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డికి చెందిన శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ పనులు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరోవైపు ఈపీడీసీఎల్ సొంతగా రూ.14.73 కోట్లతో 10.5 కి.మీ. మేర భూగర్భ కేబుల్ ఏర్పాటు చేసి దీనికి అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
రుషికొండపై ఇప్పటికే రెండు భవనాలు పూర్తికాగా, రూ.19 కోట్లతో వేగంగా ఇంటీరియర్ పనులు, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి రుషికొండ చివరి వరకు 40 అడుగుల రోడ్డు పనులు పూర్తి చేశారు. తాజాగా రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం, పచ్చదనం పెంపొందించడానికి పర్యాటకశాఖ రూ.12.50 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది.
 
మరోవైపు, రుషికొండ సమీపంలో రాజధాని హంగులు కనిపించేలా సుందరీకరణ పనులను ఇప్పటికే 'జి-2' సన్నాహక సదస్సు పేరుతో చేశారు. మిగిలిన పనులు ప్రస్తుతం పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. సుమారు రూ.4.03 కోట్లతో రుషికొండ సమీపంలోని వైఎస్ఆర్ వ్యూపాయింట్‌కు వచ్చే సందర్శకుల వాహనాలు నిలపడానికి, అక్కడ ట్రాఫిక్ సమస్యల్లేకుండా రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. 
 
తాజాగా దసరాకు విశాఖ ముఖ్యమంత్రి వస్తున్నారన్న హడావుడితో సీతకొండ వద్ద రహదారి విస్తరణకు కొండ భాగం తొలచి పనులు మొదలు పెట్టారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రహదారి విభాగినిపై రూ.16 కోట్ల వ్యయంతో గ్రిల్స్ ప్రతిపాదించి పూర్తి చేస్తున్నారు. వీటితోపాటు తాజాగా నగరంలో 20 ప్రాంతాల్లో రహదారులు, కూడళ్ళను అభివృద్ధి చేసేందుకు రూ.160 కోట్లు జీవీఎంసీ సాధారణ నిధులు కేటాయించారు.