శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 10 నవంబరు 2022 (20:21 IST)

కేఎల్ రాహుల్: అందరూ అతడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

KL Rahul
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి తరువాత సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫైనల్‌కు ప్రవేశమార్గమైన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతున్నాయి. అయితే, ఈ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను టీమిండియా అభిమానులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

 
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు రాహుల్ రెండు అర్ధ సెంచరీలో చేసినప్పటికీ ఈ మ్యాచ్‌లో 5 పరుగులే చేయడంతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ఆటపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో రాహుల్ పాకిస్తాన్‌పై 4 పరుగులు, నెదర్లాండ్స్‌పై 9, దక్షిణాఫ్రికాపై 9 పరుగులు చేశాడు. ఆ తరువాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 50, జింబాబ్వే మ్యాచ్‌లో 51 చేయడంతో రాహుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడంటూ అభిమానులు ఆయనపై ఆశలు పెంచుకున్నారు.

 
కానీ, గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మరోసారి విఫలం కావడంతో గత రెండు మ్యాచులలో ఆయన ప్రదర్శనను అభిమానులు మర్చిపోయి మరీ ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు విఫలం కాగా ఇంగ్లండ్ ఓపెనర్లు భారత బౌలర్లపై ఇన్నింగ్స్ అంతా పైచేయి సాధించారు. 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించిందంటే ఆ జట్టు ఓపెనర్లు ఎలా ఆడారా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో భారత బౌలర్లు కూడా అభిమానుల నుంచి, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 
ఇంగ్లండ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత కెప్టెన్ ఏకంగా ఆరుగురితో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత బౌలర్లపై విమర్శలు చేశారు. భయ్యా అంటూనే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారా అంటూ ఎద్దేవా చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ మినహా ఈ మ్యాచ్‌లో మిగతా అందరు బౌలర్ల ఎకానమీ రేటు 10కి పైనే ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 7.5 ఎకానమీ రేట్‌తో 30 పరుగులు ఇవ్వగా అర్షదీప్ సింగ్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చాడు. అర్షదీప్ ఎకానమీ రేట్ కూడా 7.5 ఉంది.

 
ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 12.5 ఎకానమీ రేటుతో 25 పరుగులు ఇచ్చుకోగా షమీ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 13 ఎకానమీ రేటుతో 39 పరుగులు ఇచ్చుకున్నాడు. బ్యాట్‌తో ఇంగ్లండ్ జట్టుపై పైచేయి సాధించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. ఆయన ఎకానమీ రేట్ 11.33. ఇక రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ బౌలింగ్ ఎకానమీ 13.5. ఆరుగురు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌కు విజయం అందించడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫలితమే సోషల్ మీడియాలో ట్రోలింగ్.