భారత కుర్రోళ్ళ వీరకుమ్ముడు... బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్‌కు గర్వభంగం (video)
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత కుర్రోళ్లు కుమ్మేశారు. తమ ముందు ఉంచిన 328 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని యువకులతో కూడిన టీమిండియా కేవలం ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు గర్వభంగం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
328 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో పంత్ బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టగానే టీమిండియా ఆటగాళ్లలో విజయానందం ఉప్పొంగింది. పంత్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్‌కు 4, స్పిన్నర్ నేథన్ లైయన్ కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పంత్‌నే వరించింది.
అంతకుముందు.. 4/0 ఓవర్ నైట్ స్కోరుతో చేజింగ్ కొనసాగించిన భారత్ మంగళవారం ఉదయం ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా జోడీ అద్భుత భాగస్వామ్యంతో భారత్‌ను గెలుపు బాటలో నిలిపింది. గిల్ 91 పరుగులు చేయగా, పుజారా 56 పరుగులు సాధించాడు.
భారత కెప్టెన్ రహానే (24) కూడా వెనుదిరిగినా పంత్ మాత్రం మొండిపట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి చక్కని సహకారం లభించింది. సుందర్ 29 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్‌తో 22 పరుగులు సాధించాడు. పంత్ స్కోరులో 9 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. దీంతో 328 పరుగుల విజయలక్ష్యం చిన్నబోయింది.
కాగా, ఈ విజయంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ వద్దే ఉండనుంది. వాస్తవానికి ఆసీస్‌తో పోలిస్తే ప్రస్తుత భారత జట్టుకు అనుభవం తక్కువ. జట్టులో కొత్త ఆటగాళ్లే ఎక్కువ. జట్టులో సగం మంది సీనియర్లు గాయాలతో దూరమైన స్థితిలో సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు శక్తికి మించిన ప్రదర్శన చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించారు.
టెస్ట్ సంక్షిప్త స్కోరు వివరాలు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్.. 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్.. 336 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్.. 294
భారత్ రెండో ఇన్నిగ్స్... 329/7