స్టీవ్ స్మిత్ వక్రబుద్ధి.. రిషబ్ పంత్ గార్డ్‌ను చెరిపేస్తూ.. కెమెరాకు చిక్కాడు..
ఆస్ట్రేలియా జట్టు విజయం కోసం ఎంతకైనా తెగిస్తుందనేందుకు స్టీవ్ స్మిత్ చేసిన పనే కారణం. సాధారణంగా అవతలి టీం ప్లేయర్స్‌ను రెచ్చగొట్టడం లేదా నోటికి పని చెప్పడం వంటివి ఆ జట్టు ప్లేయర్స్ చేస్తుంటారు. దానిలో భాగంగానే ఆ టీమ్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గతంలో బాల్ టాంపరింగ్‌లో దొరికిపోయి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ తన వక్ర బుద్ధిని మరోసారి చూపించుకున్నాడు.
సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఓటమి తప్పించుకోవడం అసాధారణంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మూడో వికెట్ రూపంలో రహానె ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. అతను అనూహ్యంగా చెలరేగి ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతను 97 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇలా చివరి రోజు ఆసీస్ బౌలర్లను రిషబ్ పంత్ చితక బాదుతుంటే.. తట్టుకోలేకపోయిన స్మిత్ తన చేష్టలతో పరువు తీసుకున్నాడు. డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను కావాలని చెరిపేస్తూ స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. తన గార్డ్ చెరిపేయడంతో పంత్ మరోసారి మార్క్ చేసుకోవాల్సి వచ్చింది.
స్మిత్ చేసిన ఈ పనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా తమ ప్లేయర్ తీరుపై మండిపడ్డారు. ఇదేనా నీ క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశ్నించారు. స్మిత్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. షేమ్ ఆన్ యు స్మిత్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అతడి తీరును దుయ్యబడుతున్నారు.