శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:43 IST)

పట్టించుకోకపోతే కిలోలకొద్దీ కొవ్వుతో బరువు పెరగడం ఖాయం... అడ్డుకునేదెలా?

చూస్తుండగానే బరువు పెరిగిపోతారు చాలామంది. ఈరోజుల్లో కదలకుండా కుర్చీకి అతుక్కుపోయి చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. దీనితో విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. ఇలాంటి సమస్యను ఎదుర్కోవాలంటే ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. మీరు తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకుంటుండండి. ప్రతి రోజు నడక తప్పనిసరి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చవుతాయి. 
 
వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. మీకు ఆకలి వేసినప్పుడే తినేందుకు ప్రయత్నించండి. ఆకలి లేనప్పుడు తినకండి. ప్యాకేజ్ ఫుడ్‌ అంటే... ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
 
మీరు లిఫ్టులో పైఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లయితే లిఫ్టును ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి. ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాల పాటు నడవండి. దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది. ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడకండి. టీవీని చూస్తూ తినడం మూలాన లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు.