గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:59 IST)

పుదీనా ఆకులను నమలడం.. రసాన్ని తాగితే..?

నొప్పులతో బాధపడేవారు చాలామంది వాటి నుండి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అప్పుడప్పుడూ అయితే పర్వాలేదు, నొప్పులు తగ్గించుకోవడానికి తరచుగా లేదా ఎక్కువ మోతాదులలో వినియోగించినట్లయితే వాటిలో ఉండే రసాయనాల వలన అనేక అరోగ్య సమస్యలు తలెత్తుతాయి.


కొన్ని అవయవాలు పాడైపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు మరియు జీర్ణసంబంధిత నష్టాలను కలిగిస్తాయి. స్టెరాయిడ్లు, వాపు తగ్గించే ఓవర్-ద-కౌంటర్ మందులు అజీర్ణం, మగత, మైకం, నిరాశ, దురద లేదా చెమటపట్టుట వంటి లక్షణాలను కనబరుస్తాయి. బలహీన రోగనిరోధక వ్యవస్థకు కారణమవుతాయి. వాటిని ఉపయోగించకూడదనుకునే వారు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే మూలకాలతో నొప్పి నివారణ మందులను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. నొప్పుల నివారణలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా దీర్ఘకాలిక కండరాల నొప్పులు, వెన్నునొప్పి, పంటినొప్పి మొదలైన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
పసుపు యాంటీఆక్సిడెంట్ వలె మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీకార్సినోజెనిక్ లక్షణాలను సైతం కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడగలదు. పసుపు-టీ, లేదా పాలలో పసుపును కలిపి తీసుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందగలరు. కండరాల నొప్పులు, కడుపునొప్పి, చాతీనొప్పి, ఆర్థరైటిస్, బహిష్టునొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అల్లం కలిగి ఉంటుంది. 
 
ఎగువ శ్వాసకోశ సంక్రమణ వ్యాధుల చికిత్సలో అద్భుతమైన ఏజెంట్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు, బ్రాంకైటిస్ మొదలైన తీవ్రమైన సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. అల్లం-టీ తీసుకోవడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు.
 
లవంగాలు యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం వలన పంటినొప్పి వంటి నోటిసంబంధిత సమస్యలకు ఉపశమనం ఇవ్వడంలో సహాయం చేయగలదు. జలుబు, తలనొప్పి, కీళ్లనొప్పులు, వాపు, వికారం మొదలైన సమస్యలకు నొప్పినివారణ మార్గంగా ఉపయోగపడగలదు. ఒకవేళ మీరు పంటినొప్పితో బాధపడుతున్నట్లయితే రెండు లవంగాలను పొడిగా చేసి అందులో ఒకచుక్క ఆలివ్ ఆయిల్ వేసి ప్రభావిత ప్రాంతమునందు అప్లై చేయడం ద్వారా ఉపశమనాన్ని పొందగలరు. 
 
వెల్లుల్లిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు ఎటువంటి ఇన్ఫెక్షన్లనైనా నయంచేయడంలో సహాయం చేస్తాయి. ముఖ్యంగా చెవిపోటు, ఆర్థరైటిస్ నొప్పి మొదలైన వాటిలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముడివెల్లుల్లిని తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలరు. దెబ్బతిన్న పళ్ళను చికిత్స చేసేందుకు దంచిన వెల్లుల్లిలో చిటికెడు ఉప్పువేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. కండరాలనొప్పి మరియు కీళ్లనొప్పుల విషయంలో వెచ్చని వెల్లుల్లి చమురు మర్ధన ద్వారా ఉపశమనం పొందవచ్చు. 
 
కాఫీలో ఉండే కెఫీన్ తలనొప్పి, కండరాలనొప్పులు, ఇతర నొప్పుల నుండి ఉపశమనం కలిగించుటకు అద్భుతంగా పనిచేయగలదు. నొప్పి నివారణా ఔషధాల కన్నా కెఫీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాఫీ కొద్ది నిమిషాల వ్యవధిలోనే నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వగలదని పరిశోధనల్లో తేలింది. పుదీనా కండరాలనొప్పి, తలనొప్పి, పంటినొప్పి, నరాలనొప్పి మొదలైన సమస్యలను నివారించడంలో సహాయపడే చికిత్స లక్షణాలను కలిగి ఉంటుంది. 
 
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో మరియు మానసిక ప్రశాంతతను కలిగించుటలో కూడా సహాయం చేయగలదు. పుదీనా ఆకులను నమలడం లేదా రసాన్ని తీసుకోవడం చేయవచ్చు. ఎర్రద్రాక్షలో రిస్వరేట్రల్ అని పిలవబడే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన సమ్మేళనం ఉంటుంది. ఇది ఎర్రద్రాక్షకు ఎరుపు రంగునిస్తుంది, మరియు శోథనిరోధక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మృదులాస్థి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ సమ్మేళనం సహాయం చేస్తుంది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, వెన్నునొప్పిని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది.