శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 ఫిబ్రవరి 2020 (20:26 IST)

చుండ్రు వదలిపెడుతుందా.. గోకే వరకూ వదిలిపెట్టదు

చుండ్రు సమస్య వున్నవారు అదేపనిగా తలలో చేతులు పెట్టి గోకుతూ వుంటారు. ఎవరైనా చూస్తారన్నది కూడా పట్టించుకోరు. ఐతే ఈ అలవాటు పదిమందిలో ఇబ్బందికి గురిచేస్తుంది. కొంతమంది ఈ అలవాటును మానుకుందామని ప్రయత్నించినా చుండ్రు వదలిపెడుతుందా.. గోకే వరకూ వదిలిపెట్టదు.
 
ఈ మొండి చుండ్రును వదిలించుకునేందుకు వేపాకుల్ని నూరి ముద్దగా చేసుకొని కప్పు పెరుగులో కలుపుకోవాలి. దానికి రెండు చుక్కల ఆలివ్ నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలుపుకొని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే త్వరలోనే సమస్య దూరమవుతుంది. 
 
మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టిస్తే చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గసగసాలను పాలతో నూరి.. తలకు లేపనం వేస్తే చుండ్రు తగ్గుతుంది. వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు చాలా వేగంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని వేడిచేయాలి. దానికి అంతే పరిమాణంలో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. జుట్టు అంతటా విస్తరించేలా, కుదుళ్లకు తగిలేలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.