మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (11:08 IST)

ఐపీఎల్‌ 2021 వేలం.. రూ.2కోట్ల జాబితాలో హర్భజన్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ 2021 వేలం కోసం 292 మంది క్రికెటర్లతో కుదించిన తుది జాబితాను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వారిలో 164 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌, బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్, ఆస్ట్రేలియా స్టార్లు స్టీవ్‌స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌.. కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. 2021 సీజన్‌లో 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు 13 మందిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో మూడు ఖాళీలు ఉన్నాయి. ఈనెల 18న ఐపీఎల్‌ 2021 వేలం చెన్నైలో జరగనుంది. మొత్తం 1,114 మంది ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఆడేందుకు దరఖాస్తు చేసుకోగా అందులో 292 మందిని ఎంపిక చేశారు. 
 
మరోవైపు గతనెల 20న అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను ట్రేడింగ్‌ చేసుకునే అవకాశం లభించింది. 
 
ఇప్పుడా సమయం కూడా ముగిసిపోవడంతో బీసీసీఐ గతరాత్రి తుది జాబితాను విడుదల చేసింది. ఇక ఈ సీజన్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ను ఎవరు కొనుగోలు చేస్తారనేదే ఆసక్తిగా మారింది. అతడి కనీస ధర రూ.20లక్షలుగా నమోదు చేసుకున్నాడు.