మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 జనవరి 2020 (20:46 IST)

ఒకే రాష్ట్రం ఒక్క రాజధాని: పిలుపునిచ్చిన ఎన్నారైలు

ఎడిసన్: రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతు ఖండాంతరాలు దాటింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రవాస తెలుగు ప్రజలు అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకి సంఘీభావం ప్రకటించటమే కాకుండా ఉద్యమిస్తున్న రైతులకు, ఉద్యమకారులకు ఆర్ధికంగా కూడా అండదండలందించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. NRIsతో JACని స్థాపించాలని ప్రతిపాదించారు. ఎడిసన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్, అనేక శాఖల భవనాలు ఇక్కడే ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా వాటినే ఉపయోగించండి. ఇప్పటికే ఇక్కడ రూ.10 వేల కోట్ల ఖర్చు చేశారు. మరో రూ3 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవీ పూర్తవుతాయి. ప్లాట్లు రైతులకు ఇవ్వగా 10 వేల ఎకరాల భూమి ఉంటుంది. దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చు. 
 
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తే ఎక్కడికి రావాలి. 3 రాజధానుల చుట్టూ పారిశ్రామికవేత్తలు తిరగాలా.. 3చోట్లా తిరిగి పరిశ్రమలకు అనుమతులు పొందాలా..? విమానాలు కూడా లేకుండా చేశారు వాళ్లు తిరగడానికి.. వచ్చిన విమానాలను కూడా లేకుండా పుణ్యం కట్టుకున్నారు. కర్నూలులో విమానాలను రాకుండా చేశారు. విశాఖ, గన్నవరంలో విమానాలను రద్దు చేయించారు.
 
సచివులు ఉండేది సచివాలయం. సచివులు ఒకచోట, సచివాలయం మరోచోట.. ముఖ్యమంత్రి ఒకచోట, మంత్రులు ఇంకోచోట.. గవర్నర్ ఒకచోట, ముఖ్యమంత్రి ఇంకోచోట.. సెక్రటేరియట్ ఒకచోట, హెచ్‌వోడిలు మరోచోట.. ఈ చర్యలను ఏమనాలి..? రాజధాని అంశం ఒక వ్యక్తి సమస్య కాదు.. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య. 
 
ఇది ఒక ప్రాంత సమస్య కాదు, యావత్ రాష్ట్రంలో 13 జిల్లాల సమస్య. మనకు చిరునామా ఉండాలని యువతరం ఆలోచించుకోవాలి.  ఇది నా రాజధాని అని గర్వంగా చెప్పుకోవాలి. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం మంచిదికాదు. సమాజంలో.. కుల ప్రస్తావన తెచ్చి ఎందుకు చీలిక తెస్తున్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని వనరు గోదావరి జలాలు మనకున్నాయి. వాటి సక్రమ వినియోగంపై దృష్టి పెట్టకుండా ప్రాంతీయ విద్వేషాలు పెంచడానికి రెచ్చగొడతారా.! అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
200 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాట్స్ మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతాప్ చింతపల్లి, రాజా కసుకుర్తి, పవన్ తాతా, చంద్రశేఖర్ కొణిదెల, రేఖ మంచి, వంశి, రాధాకృష్ణ, శ్రీ కోనంకి మొదలైనవారు ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యటానికి కృషి చేశారు.