శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:15 IST)

కదిరి కాటమరాయుడు కథ ఏంటి?

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహ స్వామి ఆరాధన కనిపిస్తుంది. నవనారసింహ క్షేత్రాలతో పాటుగా ఆయనకు అడుగడుగునా పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ఒకటే కదిరి. అక్కడ కొలువైన స్వామి పేరే కాటమరాయుడు!
 
అనంతపురం జిల్లా కదిరి పట్నంలో వెలసిన లక్ష్మీనరసింహునికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. నరసింహస్వామి స్తంభంలోంచి వెలువడి హిరణ్యకశిపుని చంపింది ఇక్కడే అని భక్తుల నమ్మకం. కదిరి సమీపంలోని గొడ్డువెలగల గ్రామంలోనే ఈ సంఘటన జరిగిందంటారు. అక్కడ ఖదిర అనే చెట్టు కలపతో చేసిన స్తంభం నుంచి చీల్చుకుని విష్ణుమూర్తి, హిరణ్యకశిపుని సంహరించాడట. ఆ చెట్టు పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని కదిరి అని పిలుచుకోసాగారని స్థలపురాణం చెబుతోంది.
 
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నరసింహస్వామి ఉగ్రరూపంలోనే సంచరిస్తూ ఓ కొండమీద విశ్రమించాడు. ఆ సమయంలో దేవతలంతా ఆయన వద్దకు చేరి తమ స్తోత్రాలతో ఆయన కోపాన్ని ఉపశమించే ప్రయత్నం చేశారు. వారి స్తోత్రాలకు ప్రసన్నుడైన స్వామి అక్కడే విగ్రహరూపంలో నిలిచిపోయాడు. అలా దేవతల స్తోత్రాలతో పునీతం అయ్యింది కాబట్టి... ఈ కొండకు స్తోత్రాద్రి అన్న పేరు వచ్చిందట. అలా కొండ మీద వెలసిన దేవుడే అనాదిగా కదిరి నరసింహునిగా పూజలందుకుంటున్నాడు.
 
కదిరి నరసింహుని కాటమరాయుడనీ, బేట్రాయి స్వామి అనీ పిలుచుకోవడమూ కనిపిస్తుంది. కదిరి ఆలయానికి సమీపంలో కాటం అనే పల్లెటూరు ఉండటంతో ఆయనకు కాటమరాయుడనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ‘వేటరాయుడు’ అన్న పేరు కన్నడిగుల నోటిలో నాని బేట్రాయి స్వామిగా మారిందట. వసంత రుతువులో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి... ఆయనకు వసంత వల్లభుడు అనే పేరు కూడా ఉంది.
 
కదిరి నరసింహస్వామి ఆలయం ఎప్పుడు నిర్మించారో చెప్పడం కష్టం. కానీ దాదాపు 700 ఏళ్లనాటి శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. విజయనగర రాజులు ఈ ఆలయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. హిందూ ప్రభువులే కాకుండా ముస్లిం రాజులు కూడా ఈ ఆలయానికి సేవలు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అందుకేనేమో ఇప్పటికీ ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముస్లింలు సైతం విరివిగా పాల్గొంటూ ఉంటారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి స్వామివారితో పాటుగా ప్రహ్లాదుడు కూడా ఉండటం ఓ విశేషం. కేవలం మూలవిరాట్టుకే కాదు... ఇక్కడి ఉత్సవ విగ్రహాలకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఉత్సవ విగ్రహాలను సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తే, భృగు మహర్షికి అందించాడని చెబుతారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఫాల్గుణ పౌర్ణమికి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించే రథం మన దేశంలోనే అతి పెద్ద రథాలలో ఒకటి. స్వామివారిని ఇంత ఘనంగా ఊరేగిస్తారు కాబట్టే ఫాల్గుణ పౌర్ణమిని కదిరి పున్నమి అని కూడా పిలుచుకుంటారు. అనంతపురం జిల్లాలో చాలామంది ఈ స్వామివారి మీద ఉన్న భక్తితో కాటమరాయుడు అని పేరు పెట్టుకుంటారు. ఇదీ కాటమరాయుని కథ!