సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (10:15 IST)

#Mahashivratri ... ఈ మహాపర్వదిన వేడుక ప్రతి ఒక్కరిదీ..

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. కుటుంబ జీవితం గడిపేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లి రోజుగా పరిగణిస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. 
 
సన్యాసులకు మాత్రం ఇది కైలాస పర్వతంతో శివుడు ఒకటైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. 
 
ఇతిహాసాలను పక్కన పెడితే, ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమమైన రోజు మహాశివరాత్రి. అందుకే దీనికి యోగ సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యం. జీవం ఉన్న ప్రతీదీ, మనకు తెలిసిన ప్రతి పదార్థం, మనకు తెలిసిన జగత్తు, ఖగోళం... ఇవన్నీ శక్తికి కోట్లాది రూపాల్లో వ్యక్తీకరణలే! ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తర్వాత ఈ సంగతి నిరూపించింది. 
 
ఈ వాస్తవాన్ని ప్రతి యోగీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. యోగి అనే పదానికి అర్థం ‘ఆ (శక్తి) ఉనికి తాలూకు ఏకత్వాన్ని గ్రహించినవాడు’ అని! ఆ ఏకత్వం గురించీ, ఆ ఉనికి గురించీ తెలుసుకోవాలనే కోరిక ఉంటే - అదే యోగ! దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మహాశివరాత్రి మార్గ నిర్దేశనం చేస్తుంది. అందుకే మహాశివరాత్రి పర్వదినం ప్రతి ఒక్కరిదీగా చెప్పుకుంటారు.