సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (17:01 IST)

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు.