సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సిహెచ్
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (23:32 IST)

సంక్రాంతి నాడు పెరుగును దానం చేస్తే... (video)

తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి. సంవత్సరంలో వచ్చే 12 సంక్రాంతులలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సంక్రాంతి అనగానే రకరకాల ముగ్గులతో, గొబ్బెమ్మలతో ముంగిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. రకరకాల పిండి వంటలు, కొత్తబట్టలు, కొత్త అల్లుళ్లతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగను ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు.

 
మెుదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి పండుగ చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వదినాలలో ఒకటి. మన ఇతర పండుగల వలె ఇది తిధి ప్రధానమైన పండుగ కాదు. ఈ పర్వదినం దక్షిణాయనానికి చివరి రోజు అంటే ధనుర్మాసం ఈ భోగి రోజునే వస్తుంది. భోగి నాడు తెల్లవారుజామున ఇండ్ల ముందు మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు.

 
పనికిరాని వస్తువులను ఈ మంటలలో వేసి కాలుస్తారు. భోగి మంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఈ భోగి స్నానం వలన దుష్టపీడలు విరగడై , అశుభం తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం. భోగినాటి వంటకంలో కొత్త ధాన్యంతో పులగాన్ని విధిగా వండుతారు. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా కోసిన రాగులు, జొన్నలు మెుదలైన వాటితో రొట్టెలను చేసుకొని తినే సంప్రదాయం కూడా ఉంది.

 
భోగినాటి సాయంత్రం పేరంటము చేసి చిన్న పిల్లలకు భోగి పండ్లను పోయడం మన సంప్రదాయం. రేగుపండ్లు, చిల్లర నాణాలను కలిపి తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఈ భోగి పండ్లను పిల్లలపై పోస్తారు. కాగా గోదాదేవి ఈ భోగి నాడే శ్రీరంగనాధుని భర్తగా పొందింది. గోదాదేవికి అంతటి భోగభాగ్యం అబ్బిన ఈ భోగి రోజు ,అప్పటి నుండి జన సామాన్యానికి కూడా సమస్త భోగాలనిచ్చే రోజుగా ప్రసిద్ది పొందింది. సూర్యభగవానుడు ప్రతి నెలలోను ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేసిస్తుంటాడు. దీనికే సంక్రమణం అని పేరు.

 
సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశి లోకి ప్రవేశించటాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రాంతి రోజున అభ్యంగన స్నానం చేసి నువ్వులు, బెల్లం, గుమ్మడి కాయలు మెుదలైనవి విధిగా దానం చేయడం వలన ఈ రోజున పుణ్యస్త్రీలు పసుపు, కుంకుమ, సుంగంధ ద్రవ్యాలు, పూలు మెుదలైనవి ముత్తయిదవులకు ఇవ్వడం వలన ఐదవతనం వృద్ది చెందుతుంది.

 
ఈ సంక్రాంతి నాడు పెరుగును దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యశోద ఈ విధంగానే బ్రాహ్మణునికి పెరుగుదానం చేయడం వల్ల కృష్ణుడు ఆమెకు కొడుకుగా లభించాడని కధనం. సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమగా ఆచరిస్తారు.

ఈ రోజు పూర్తిగా రైతులకు సంబందించిన పండుగ. ఈ రోజున పశువుల కొట్టాన్ని శుభ్రం చేసి పశువుల శాలను మామిడి తోరణాలతోను, పువ్వులతోను అలంకరిస్తారు. తరువాత పండిన పొలాలకు వెళ్లి పొంగలి మెతుకులను చల్లుతారు. దీనినే పోలు చల్లుట అంటారు. భూతప్రేతాల వంటి దుష్ట శక్తులు పంటలను పాడు చేయకుండా ఉండేందుకు ఈ పోలి ఆచారం ఏర్పడింది.