మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (13:37 IST)

జైలులోని ఖైదీల భార్యలపై కన్నేసిన జైలు ఉన్నతాధికారి!

charlapalli jail
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి జైలులో ఉన్న ఖైదీల భార్యలపై ఆ జైలులో పని చేసే ఉన్నతాధికారి ఒకరు కన్నేశారు. వారు తమ భర్తలను కలిసేందుకు వచ్చినపుడు వారితో మాటలు కలిపి... తన గదికి రావాలంటూ కోరేవాడు. ఈ విషయంపై పలువురు ఖైదీల భార్యలు జైళ్ళ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరా తీసిని ఉన్నతాధికారులు ఈ ఆరోపణలు నిజమని తేలడంతో కామాంధ అధికారిని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. 
 
వివిధ నేరాలకు పాల్పడి జైలుపాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్ధేశిత సమయంలో ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అనుమతిస్తుంటారు. అయితే, చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథ్ ఆ ఖైదీల భార్యలపై కన్నేసి వారిని వేధించసాగాడు. దీంతో అనేక బాధితులు జైళ్ళ శాఖకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంపై జైళ్ళశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ విచారణకు ఆదేశించారు. దీంతో చింతల దశరథ్‌ను జైలు శాఖ ఆధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. ఈయన గతంలో కూడా జైలులో పని చేసే మహిళా సిబ్బందిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైవుంది.