బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (18:14 IST)

ఆంధ్రోళ్లకు - తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు : గంగుల కమలాకర్

gangula kamalakar
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెలాఖరులో జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలే అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రావాళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణాను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ని గెలిపిస్తే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్క రోజూ కూడా ఆయన గ్రామాల ముఖం చూడలేదని, ఇపుడు ఎమ్మెల్యేగా చేస్తే చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. 
 
ఆయన మంగళవారం కొత్తపల్లి మండలం మిల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణాను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. ఆంధ్రావాళ్ళకు, మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నిక అన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటు వేయాలని ఆయన కోరారు. 
 
బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృథా చేసుకోరాదని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇతర పార్టీల చేతిలో మోసపోతే ఇబ్బందిపడక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగలు, మోసగాళ్ళు అని, వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.