జస్టిస్ ఫర్ నాగరాజు.. నా భర్తను నడిరోడ్డుపై నరికేశారు.. అందరూ చూశారే కానీ..?
హైదరాబాదులో పరువు హత్య కలకలం రేపింది. నగరంలో ఓ ముస్లిం మహిళను ఆమె కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ దళిత వ్యక్తిని హత్య చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను మహిళ సోదరుడు, మరో కుటుంబ సభ్యులు వెంబడించడంతో రద్దీగా ఉండే రోడ్డుపై ఈ దారుణం జరిగింది.
బిల్లాపురం నాగరాజు (26) అనే యువకుడు షెడ్యూల్డ్ కులానికి చెందిన వాడు. నాగరాజును పెళ్లాడటం అతని భార్య సయ్యద్ అష్రిన్ సుల్తానా కుటుంబీకులకు నచ్చలేదు. అందుకే నాగరాజు హత్యకు గురయ్యాడు.
ఈ నేపథ్యంలో నాగరాజు భార్య సయ్యద్ అష్రిన్ సుల్తానా మాట్లాడుతూ.. తాము చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు చెప్పారు. సుల్తానను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో నాగరాజు ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు, కానీ తిరస్కరణకు గురయ్యాడు.
దీంతో ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్ వేడుకలో వివాహం చేసుకున్న ఈ జంట హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నివసించడం ప్రారంభించారు. అయితే నాగరాజు హత్యకు గురవడం భార్యను కుంగదీసింది.
భర్త హత్యపై ఆమె మాట్లాడుతూ.. "వారు నా భర్తను నడిరోడ్డు మధ్యలో చంపారు. ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. నా సోదరుడు, ఇతరులు కలిసి హత్య చేశారు. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నేను ప్రతి ఒక్కరినీ వేడుకున్నాను. నా కళ్లముందే ఆయన్ని చంపేశారు. అందరూ ఇదంతా చూస్తుండిపోయారే కానీ ఎవ్వరూ నా భర్తను కాపాడలేదు. చివరికి ఇనుప కర్రలతో అతనని కొట్టి చంపారు' అని సుల్తానా ఆవేదన వ్యక్తం చేశారు.
వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు కావడంతో బాలిక కుటుంబ సభ్యులు నాగరాజును హత్య చేశారని యువకుడి బంధువు ఒకరు ఆరోపించారు.
ముస్లిం మహిళలను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తి నాగరాజు హత్యకు అనంతరం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ నాగరాజు అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అవుతోంది.
బుధవారం రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాలిక కుటుంబానికి చెందినవారు.
సంఘటనా స్థలంలో ఉన్న చాలా మంది ఈ సంఘటనను వీడియో తీయగా, కొందరు ఫోటోలు తీశారు, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఐపీసీలోని సెక్షన్ 302 (హత్య) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనను ఖండించిన బీజేపీ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.