సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (12:10 IST)

స్కూళ్ళ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కారు

students
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఇందులోభాగంగా, ఈ నెల 12వ తేదీ నుంచి స్కూల్స్ పునఃప్రారంభంకానున్నాయి. 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి వర్కింగ్ డేగా పేర్కొంది. ఇకపై ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేయనున్నారు. 
 
2023-24 విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలుగా ప్రటించింది. ఈ యేడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడు నుంచి ఐదు పీరియడ్లను ఆటలకు కేటాయించాలని, ప్రతి నెలా నాలుగో శనివారం నో బ్యాగ్ డేను పాటించాలని పేర్కొంది. ఆ రోజంతా ఆటపాటలకే కేటాయించాలని సూచన చేసింది. 
 
దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది. రోజూ 30 నిమిషాల పాటు రీడింగ్, ఐదు నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రతి నెల మొదటివారంలో పాఠశాల విద్యాకమిటీ సమావేశం, మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాలని కోరింది. 
 
ముఖ్యంగా, 2024 జనవరి పదో తేదీ నాటికి సిలబస్ పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. మార్చిలో పరీక్షల నేపథ్యంలో రివిజన్ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 18వ తేదీ వరకు ఏస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని కోరింది. 
 
ఈ యేడాది అక్టోబరు నెల 14వతేదీ నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనుంది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా పేర్కొంది. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవుగా విద్యాశాఖ కొత్త విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది.