మంగళవారం, 6 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (15:28 IST)

భార్యాభర్తలు చీటికీ మాటికీ గొడవపడుతున్నారా? రక్తంలో బ్యాక్టీరియా?

భార్యాభర్తల అనుబంధం గొప్పది. దంపతులు అన్యోన్యంగా జీవనం గడపాలని.. అప్పుడే సంసారం సుఖమయమవుతుందని పెద్దలు చెప్తుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. జీవనాన్ని గడిపితే.. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సునాయాసంగా గెల

భార్యాభర్తల అనుబంధం గొప్పది. దంపతులు అన్యోన్యంగా జీవనం గడపాలని.. అప్పుడే సంసారం సుఖమయమవుతుందని పెద్దలు చెప్తుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుని.. జీవనాన్ని గడిపితే.. ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సునాయాసంగా గెలుచుకోవచ్చునని వారు చెప్తుంటారు. అయితే ఆధునిక యుగంలో దంపతుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. 
 
స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువైపోతున్నాయి. అవి కాస్త విడాకులకు దారితీస్తున్నాయి. క్రమేణా అక్రమ సంబంధాలకు, సహజీవనాలకు దారితీస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. భాగస్వామితో అంటే కట్టుకున్న భార్యతో లేదా భర్తతో మాటి మాటికీ గొడవపడుతున్నారా..? సూటిపోటి మాటలతో మీ భర్తను లేదా భార్యను వేధిస్తున్నారా? అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుందని తాజాగా అధ్యయనంలో తేలింది. 
 
ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగే గొడవలతో ఏర్పడే మానసిక రుగ్మతలపై పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో 45కి మించిన జంటలు పాల్గొన్నాయి. వారి మధ్య ప్రేమానురాగాలు, సంబంధాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి గొడవలను కూడా పరిశీలించారు. గొడవకు ముందు, గొడవ తర్వాత వారి రక్తనమూనాలను పోల్చి చూశారు. గొడవపడని వారితో పోల్చితే.. చీటికి మాటికి గొడవపడే దంపతుల్లో ఒత్తిడి, మూడ్ డిజార్డర్ వంటి సమస్యలున్నట్లు తేలింది.
 
జీవిత భాగస్వామి పట్ల ద్వేషం, వారిపై వున్న కోపం కారణంగా రక్తంలో బ్యాక్టీరియాకు సంబంధం వున్నట్లు తేలింది. ఈ పరిశోధనను బట్టి భార్యాభర్తల మధ్య గొడవలు మానసిక రుగ్మతలకే కాకుండా.. ఆరోగ్య సమస్యలను కూడా కొనితెచ్చి పెడతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దంపతులు గొడవలను పక్కనబెట్టి.. కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా.. శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు.