శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:26 IST)

ఆ 11 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు.. కేంద్రం

దేశంలో కరోనా వైరస్ ప్రమాదఘంటికలను మోగిస్తోంది. దీనికి నిదర్శనమే ప్రతి రోజూ వేలసంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 11 రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
 
ఆ 11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని తెలిపింది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. 
 
ముఖ్యంగా, దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పునరుద్ఘాటించింది. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. 
 
కాగా, దేశంలో గ‌త 24 గంటల్లో 81,466 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 50,356 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 469 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,63,396కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,25,039 మంది కోలుకున్నారు. 6,14,696 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి వ్యాక్సిన్లు వేశారు.