ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ : చైనాలో మళ్లీ కలకలం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. తాజాగా ఈ వైరస్ ఐస్‌క్రీమ్‌లో కూడా కనిపించింది. దీంతో ఐస్క్రీమ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసింది. దీంతో ఆ దేశంలో మరోమారు కలకలం చెలరేగింది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా అప్రదిష్ట మూటగట్టుకున్న చైనాలో తాజాగా టియాన్జిన్ నగరంలో ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ క్రిములను గుర్తించారు. దాంతో ఆ బ్యాచ్‌కు చెందిన ఐస్‌క్రీమ్ బాక్సులన్నింటినీ కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది. 
 
ఈ పరిణామంతో టియాన్జిన్లోని దఖియావోదావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిస్థితులు చక్కబడే వరకు కంపెనీ మూతవేశారు. దఖియావోదావో ఫుడ్ కంపెనీలో ఉద్యోగులు కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు దీనిపై ఆంక్షలు విధించాయి.
 
మరోవైపు, ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్ తిని కరోనా బారినపడినట్టు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. ఈ కంపెనీ తాజాగా 29 వేల ఐస్‌క్రీమ్ కార్టన్లను అమ్మకానికి సిద్ధం చేసింది. టియాన్జిన్‌లో విక్రయించిన 390 కార్టన్లను గుర్తించి వెనక్కి తీసుకున్నారు. 
 
కాగా, దఖియావోదావో ఫుడ్ కంపెనీ తమ ఐస్‌క్రీముల్లో ఉపయోగించేందుకు న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి పాల ఉత్పత్తులును దిగుమతి చేసుకుంటుంది. వీటి ద్వారా కరోనా వైరస్ క్రిములు ఐస్‌క్రీముల్లోకి చేరి ఉంటాయన్న కోణంలోనూ విచారిస్తున్నారు.