మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (15:00 IST)

మొన్న రోహిత్ శర్మ.. నేడు విరాట్ కోహ్లీ.. భారత్‌కు గాయాల బెడద

rohit - kohli
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గాయాలబెడద ఎక్కువైంది. ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. బుధవారం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డారు. 
 
నెట్ ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఓ బంతి గజ్జల్లో తగలడంతో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పైగా, నొప్పి ఎక్కువ కావడంతో ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. దీంతో కోహ్లీకి బలమైన గాయమే తగిలివుంటుందన్న ఆందోళన మొదలైంది. 
 
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ మంగళారం ఇలానే స్వల్ప గాయానికే గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో విలవిలలాడు. అయితే, 40 నిమిషాల తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో బుధవారం విరాట్ కోహ్లీకి బంతి గజ్జల్లో తగిలిన తర్వాత ఆయన నెట్ నుంచి వెళ్లిపోవడం ఇపుడు ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు కోహ్లీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో 123 సగటుతో 246 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇపుడు గురువారం ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాల్సిందే.