కరోనా వైరస్ కలకలం : ఎలా వ్యాపిస్తుంది.. దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

carona virus
ఠాగూర్| Last Updated: మంగళవారం, 28 జనవరి 2020 (12:30 IST)
చైనాలో చిన్నగా మొదలై ప్రపంచంలోని పలు దేశాలకు పాకుతున్న అత్యంత ప్రమాదకారిగా మారిన వైరస్ కరోనా వైరస్‌. ఇపుడిది భారత్‌లోకి కూడా ప్రవేశించినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే నాలుగు అనుమానిత కేసులు హైదరాబాద్ నగరంలో నమోదయ్యాయి. ఇదే ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఈ నలుగురిలో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది.

అయినా.. పలు విమానాల్లో చైనా నుంచి ప్రయాణికులు వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రులను నోడల్‌ ఆస్పత్రులుగా ప్రకటించింది. గాంధీలో 40 పడకలు, ఫీవర్‌లో 40, ఛాతీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి కోసం అధికారులు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తో పాటు ఐసీయూను ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రాణాంత వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. దాని లక్షణాలేంటి, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

ఈ కరోనా వైరస్ కేవలం జంతువుల నుంచి మాత్రమే వ్యాపిస్తుందని తొలుత భావించారు. కానీ, ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా.. అంటే తుమ్ము, దగ్గు ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. లాలాజలం, కన్నీటి ద్వారా కూడా వ్యాపిస్తుందని వైద్యులు అంచనా వేశారు. కాబట్టి.. ఈ వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉండడం, ముద్దాడటం, వారు తిన్న పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ లక్షణాలు
జలుబు, ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, అధిక జ్వరం.. ఇవీ ప్రాథమిక లక్షణాలు. కొంతమందికి ఈ లక్షణాలు ముదిరి న్యూమోనియాకు, కిడ్నీ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే, వైరస్‌ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి రెండు నుంచి 14 రోజులు పడుతుంది. ఆ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు కనపడకపోవచ్చుగానీ.. వారి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 97 మంది ఎలాంటి వైద్యసహాయం అవసరం లేకుండానే కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వృద్ధుల్లో ఈ వైరస్‌ న్యూమోనియాకు కారణమవుతుంది. అది ప్రాణాంతకంగా మారుతోంది.

ఎంత ప్రాణాంతకం?
కరోనా వైరస్‌ అందరికీ ప్రాణాంతకం కాదు. ఈ వైరస్‌ బారిన పడిన ప్రతి 100 మందిలో సగటున ఇద్దరు మరణిస్తున్నట్టు అంచనా (సాధారణ ఫ్లూకేసుల్లో అయితే ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు ఒకటి కన్నా తక్కువే ఉంటుంది). అంతేకాదు చైనాలో ఈ వైరస్‌ బారిన పడినవారిలో 51 మంది కోలుకున్నట్టు అధికారికంగానే ప్రకటించారు కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే.. శ్వాసకోశ సమస్యలున్నవారికి, దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండాలి. అలాంటివారిని ముట్టుకుంటే చేతులను కనీసం 20 సెకన్లపాటు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.దీనిపై మరింత చదవండి :