శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (11:27 IST)

కోహ్లీ సేనను ఆటాడుకున్న చెన్నై బౌలర్లు... ధోనీ సేన ఘన విజయం

ఐపీఎల్ 12వ దశ సీజన్‌లో భాగంగా ప్రారంభ పోటీ శనివారం రాత్రి చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్‌ను అదిరిపోయే బోణీతో ఆరంభించింది. సొంత ఇలాఖాలో ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంటూ విజయదుందుభి మోగించింది. 
 
వేలాది మంది ప్రేక్షకుల మద్దతు మధ్య బెంగళూరుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఘనవిజయంతో లీగ్‌లో శుభారంభం చేసింది. హర్భజన్‌సింగ్, ఇమ్రాన్ తాహిర్, జడేజాలు తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఫలితంగా బెంగుళూరు జట్టు కేవలం 70 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ముఖ్యంగా, చెన్నై స్పిన్ త్రయం ధాటికి కెప్టెన్ కోహ్లీతో సహా డివిలీయర్స్, హెట్మెయిర్, అలీ సింగిల్ డిజిట్ స్కోర్లకే చాపచుట్టేశారు. భజ్జీ టాపార్డర్ భరతం పడితే.. మిడిలార్డర్‌ను తాహిర్, జడేజా కుప్పకూల్చారు. ఫలితంగా లీగ్ చరిత్రలోనే బెంగళూరు ఆరో అత్యల్ప స్కోరును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో హర్భజన్‌సింగ్ (3/20), తాహిర్ (3/9), జడేజా (2/15) ధాటికి బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్‌పటేల్(29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. 
 
ఆ తర్వాత బెంగళూరు నిర్దేశించిన 70 పరుగల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో ఛేదించింది. రాయుడు(28), రైనా(19) జట్టు విజయంలో కీలకమయ్యారు. పిచ్ పరిస్థితులకు ఎదురొడ్డి నిలుస్తూ జట్టు విజయంలో భాగమయ్యారు. చాహల్(1/6), అలీ(1/19), సిరాజ్(1/5) ఒక్కో వికెట్ తీశారు. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్భజన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.