మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (14:16 IST)

ధోనీ వచ్చాడు.. ఒకే ఓవర్‌లో రెండు స్టంపౌట్లు.. రైనా 100 క్యాచ్‌లు..(video)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్‌లో దిట్ట. ధోనీ వెనక వుంటే బ్యాట్స్‌మెన్లు జడుసుకోవాల్సిందే. క్రీజులో ఉన్నా సరే.. కాలు కదిపితే చాలు.. ఆ కదిపిన క్షణంలోనే బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు పంపిస్తాడు ధోనీ. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన స్టంపౌట్లను చూస్తే షాక్ కాక తప్పదు. 
 
చెన్నై వేదికగా బుధవారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన కీపింగ్‌లో మెరుపులతో అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో రెండు స్టంపౌట్లు చేసి ఔరా అనిపించాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇద్దర్ని స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. ధోనీ మళ్లీ స్టంపౌట్‌కు అప్పీల్‌ చేశాడు.
 
అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరాడు. మోరిస్‌ ఔట్‌కు ఇది దాదాపు జిరాక్స్‌ కాపీలా అనిపించింది. శ్రేయస్‌ కూడా పెవిలియన్‌ దారిపట్టాడు. అయితే మోరిస్‌ను స్టంపౌట్‌ చేసేందుకు ధోనీకి పట్టిన సమయం కేవలం 0.12 సెకన్లు మాత్రమే. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ను స్టంప్‌ చేసేందుకు 0.16 సెకన్లు పట్టింది.
 
మహీ జట్టులోకి వచ్చాడో లేదో మళ్లీ తన జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. వెన్నునొప్పితో రెండు మ్యాచులకు దూరమైన ధోనీ తిరిగి జట్టులో చేరీచేరడంతోనే అటు బ్యాటింగ్‌.. ఇటు కీపింగ్‌లో మెరుపులు మెరిపించాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దిల్లీ క్యాపిటల్స్‌పై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధోనీ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 
అలాగే ఐపీఎల్‌లో 5,000 పరుగులు చేసిన సురేశ్‌రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్న రైనా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో మరే ఆటగాడు ఇన్ని క్యాచులు అందుకోలేదు. 
 
రైనా తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 84, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ 82 క్యాచ్‌లు అందుకున్నారు. వికెట్ కీపర్ల విషయానికొస్తే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మాత్రమే 100 క్యాచ్‌లు అందుకున్నాడు. తన కెరీర్‌లో 189వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రైనా 37 బంతుల్లో 59 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.