ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, ఆచారాలు, అనురాగాలకు ప్రతీకగా నిలిచే విజయనగర ఉత్సవం 2002 నుండి నేటి వరకు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దసరా తరువాతి వారంలో వీటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా రెండు రోజులు విజయనగరం ఉత్సవులు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించింది.
ఉత్తరాంధ్ర కళలను ప్రతిబింబిస్తూ, రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులు వివిధ కళా ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానించబడ్డారు. వివిధ రకాల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, పులి వేషధారణలు, సంగీత రాత్రులు, పుష్ప, ఫల ప్రదర్శనలు వీక్షకులను, సందర్శకులను అలరించడానికి వేదికను సిద్ధం చేశాయి. నగరంలోని వీధులు, ప్రధాన రహదారులు రంగురంగుల లైట్లతో అలంకరించబడ్డాయి.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం అయిన పైడితల్లి జాతర ఆంధ్ర ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతర. తోలేళ్ల ఉత్సవంతో మొదలై, ఉయ్యాల కంబాల జాతరలో పూర్తయ్యే సిరిమాను సంబరాలకు ఏర్పాట్లు రెండు నెలల ముందే మొదలవుతాయి.
అసలు ఎవరీ పైడితల్లి?
ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి గజపతుల వారి ఆడపడుచు. విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగరం రాజు బొబ్బిలి రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపుగా ధ్వంసమైంది.
యుద్ధం జరిగే సమయంలో రామరాజు సోదరి పైడిమాంబ మశూచి వ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమయంలో పైడిమాంబ పూజ నిర్వహిస్తుండగా అతని సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఈ యుద్ధంలో తాండ్ర పాప రాయుడు రాజు విజయ రామరాజును సంహరించాడు. సోదరుని మరణ వార్త తెలిసి పైడిమాంబ దుఃఖంతో తనువు చాలిస్తుంది.
పైడిమాంబ మరణానంతరం ఆ రాజ్యంలో ఒక సైనికుడైన పతివాడ అప్పల నాయుడుకి కలలో కనిపించి ఓ సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే ఆ ప్రాంతంలోని ఓ సరస్సులో పడమర వైపు నుంచి వెతికితే తన విగ్రహం దొరుకుతుందని, ఆ విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. ఆ ఆలయంలో నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయ్యింది. ఆనాటి నుంచి ఆలయంలో నిత్య పూజోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
సాధారణంగా దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని ఏళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 7 వ తేదీ పైడితల్లి సిరిమాను ఉత్సవం జరుగనుంది. వాస్తవానికి సిరిమాను ఉత్సవాలు లాంఛనంగా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
అక్టోబర్ 6 తోలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7 మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. అక్టోబరు 14 మంగళవారం తెప్పోత్సవం, ఉయ్యాల కంబోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు వనంగుడిలో చండీహోమం, పూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.
పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నుంచి బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు. సిరిమాను ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అమ్మవారి స్వయంగా పర్యవేక్షిస్తారని విశ్వాసం.