తులా మాసం పూజ కోసం నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్నాయి. ప్రతి యేటా జరిగే తులా మాసం పూజల కోసం సాయంత్రం 5 గంటలకు ట్రావెన్‌కోర్ బోర్డు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుంది.
ఆదివారం నుంచి 21వ తేదీ వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు. అలాగే, ఆదివారం లాటరీ విధానంలో శబరిమల ఆలయ ప్రధాన పూజారిని ఎంపిక చేయనున్నారు. 21న శబరిమల ఆలయాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు మూసివేయనుంది.
మళ్లీ నవంబర్ 2వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. ఆ మరుసటి రోజే ఆలయాన్ని మూసేసి, మండలం - మకరవిలాక్కు పండుగ నేపథ్యంలో నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.
అయితే, ఆదివారం నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు వర్చ్యుల్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా తమ వెంట తీసుకునిరావాలన్న నిబంధనను ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది.