ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి?
ప్రతిరోజూ మనం చేసే దినచర్య ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడే జీవితంలో లక్ష్యసాధన సులువవుతుంది. అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. ఇదే ఇతరులకు ఆదర్శమవుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కులదేవత, ఇష్టదేవతకు నమస్కరించుకుని శుచిగా స్నానమాచరించాలి. తర్వాత ప్రార్థ, ధ్యాన పారాయణలు చేయాలి. ఇష్టదేవతలకు పూజ, నైవేద్యం తర్వాత ఆహారం తీసుకోవాలి.
తర్వాత జీవనోపాధికి కావలసిన ధనసంపాదనకై చేయవలసిన పనులను ధర్మలోపం లేకుండా చేయాలి. తిరిగి సాయంకాలం ఇంటి పనంతా అయిన తర్వాత కుటుంబంలోని వారంతా ఒకచోట చేరి, కొంతసేపు ధ్యానం, ప్రార్థన మొదలైనవి చేయాలి. తిరిగి పడుకునే ముందు మరోసారి దేవతా ప్రార్థన చేయాలి.
అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి. వ్రతాలను, పండుగలను అర్థవంతంగా ఆచరించాలి. జీవితంలో ఒక్కసారైనా తీర్థ క్షేత్రాలను విధి పూర్వకంగా సందర్శించాలి. పేదలకు దానధర్మాలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం వ్యక్తిగత, సామాజిక జీవితంలో నైతిక పరిశుద్ధి కోసం ప్రయత్నించాలి.