మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:11 IST)

దిశలను గుర్తించడం ఎలా..?

దిశలను గుర్తించి ఆయా దిశల్లో ఉంచదగిన వస్తువులను మాత్రమే ఆ ప్రాంతాల్లో ఉంచడం మంచిదని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ముందుగా దిశలను ఎలా గుర్తించాలంటే.. స్థలంలో ప్రతి దిశను తొమ్మిది భాగాలుగా విభజించాలి. తూర్పు వైపున తొమ్మిది భాగాల్లో ఈశాన్యం వైపు ఉన్న రెండు భాగాలను తూర్పు- ఈశాన్యంగానూ, ఆగ్నేయం వైపునున్న రెండు భాగాలను తూర్పు ఆగ్నేయంగా గుర్తించాలి. మిగిలిన ఐదు భాగాలను తూర్పు భాగంగానూ గుర్తించాలి.
 
దిక్కుల అధిపతులు:
తూర్పు దిక్కుకు అధిపతి-ఇంద్రుడు. 
ఈశాన్యమునకు అధిపతి... ఈశ్వరుడు.
ఉత్తరమునకు అధిపతి... కుబేరుడు
వాయవ్యమునకు అధిపతి... వాయువు.
పడమరకు అధిపతి... వరుణుడు.
నైరుతికి అధిపతి... నిరుతి.
దక్షిణమునకు అధిపతి... యముడు.
ఆగ్నేయమునకు అధిపతి... అగ్ని
 
ఇక దిక్కుల అధిపతి స్థానాలను బట్టి పరిశీలిస్తే.. తూర్పు భాగములో బరువులు ఉండకూడదు. ఉంటే అశుభములు కలుగుతాయి. ఈశాన్యంలో బరువులుంటే సకల అరిష్టాలు దరి చేరుతాయి. ఉత్తర భాగంలో బరువులుంటే విపరీత నష్టాలకు ఇంటి యజమానులు గురవుతారు. వాయవ్యంలో బరువులుంటే- చంచల స్వభావం, దుర్వ్యసనాలకు లోను కావడం జరుగుతుంది.
 
పడమర భాగంలో బరువులు ఉండాలి. దీనివలన పశు,పాడి వృద్ధి కలుగుతుంది. నైరుతి భాగంలో కూడా బరువులు ఉండాలి. దీనివలన శత్రువులు నశిస్తారు. శత్రుహాని ఉండదు. లేకపోతే శత్రుభయం ఉంటుంది. దక్షిణం వైపు బరువులుంటే శుభఫలితాలు, లేకపోతే అశుభాలు కలుగుతాయి. ఆగ్నేయ దిశలో బరువులు ఉండకూడదు. అలా ఉంటే అగ్ని ప్రమాదాలుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు.